హగ్గయి: ప్రారంభ పలుకులు:
బైబిల్ గ్రంథంలో ఉన్న పాత నిబంధనలో “హగ్గయి” అనే పుస్తకం చాలా చిన్నది అయినప్పటికీ, అది అందించే సందేశం చాలా శక్తివంతమైనది/గొప్పది. కేవలం రెండు అధ్యాయాలు మరియు 38 వచనాలు కలిగిన ఈ గ్రంథం, దేవుని ప్రజల పట్ల ఆయనకున్న ప్రణాళికను, వారి బాధ్యతలను మరియు దేవుని ఆలయ నిర్మాణం పట్ల వారు చూపించాల్సిన శ్రద్ధను వివరిస్తుంది. ఈ పాఠం ద్వారా మనం హగ్గయి గ్రంథం యొక్క చారిత్రక నేపథ్యం, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి, ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చిన హెచ్చరికలు మరియు ఆత్మీయ పాఠాలను తెలుసుకుందాం.
1. చారిత్ర – ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యాల పతనం
గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి, దానికి ముందు జరిగిన చరిత్రను మనం పరిశీలించాల్సి ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన సొంత ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. అయితే, వారు దేవుని మాట వినకుండా విగ్రహారాధన మరియు పాపంలో పడిపోయినప్పుడు, దేవుడు వారిని హచ్చరించడానికి అనేకమంది ప్రవక్తలను పంపాడు.
- అష్షూరీయుల దండయాత్ర (క్రీ.పూ. 722): ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు, క్రీ.పూ. 722లో అష్షూరీయులు వారిపై దండెత్తి, వారిని చెరగా తీసుకువెళ్లారు. దీంతో పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం కనుమరుగైంది.
- యూదా రాజ్యం మరియు బబులను చెర: దక్షిణ రాజ్యమైన యూదా కూడా దేవుని హెచ్చరికలను పెడచెవిన పెట్టింది. యెషయా, హబక్కూకు, మరియు యిర్మీయా వంటి ప్రవక్తలు వారిని నిరంతరం హెచ్చరించారు. ముఖ్యంగా యిర్మీయా ప్రవక్త 40 సంవత్సరాల పాటు కన్నీటితో ప్రవచించినా, ప్రజలు మారుమనస్సు పొందలేదు. ఫలితంగా, దేవుడు ఉత్తర దిశ నుండి బబులోను రాజైన నెబుకద్నెజరును వారిపైకి పంపాడు.
2. 70 సంవత్సరాల చెర
- మొదటి దాడి (క్రీ.పూ. 609): నెబుకద్నెజరు యెరూషలేముపై దాడి చేసి, దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులైన షడ్రక్, మేషక్, అబెద్నెగో వంటి యవ్వనస్తులను బబులోనుకు చెరగా తీసుకువెళ్లాడు.
- దేవాలయ ధ్వంసం (క్రీ.పూ. 587): ఆ తర్వాత సుమారు 20 సంవత్సరాలకు, నెబుకద్నెజరు తిరిగి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. దేవాలయంలోని బంగారు ఉపకరణాలను, పాత్రలను దోచుకుని బాబులోనుకు తీసుకువెళ్లాడు. యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయి, పట్టణం నిశేషంగా మారినది.
యిర్మీయా ప్రవచించినట్లుగా, యూదా ప్రజలు 70 సంవత్సరాల పాటు బబులోనులో బానిసలుగా గడపాల్సి వచ్చింది. అయితే, దేవుడు కరుణామయుడు గనుక, 70 ఏళ్ల తర్వత వారిని తిరిగి స్వదేశానికి రప్పిస్తానని వాగ్దానం చేశాడు.
Also Read: Other Sermons in Telugu – Click Here
3. పారసీక సామ్రాజ్యం & కోరేషు ఆజ్ఞ
క్రీ.పూ. 539లో బబులోను సామ్రాజ్యం పతనమై, పారసీక సామ్రాజ్యం అధికారంలోకి వచ్చింది. పారసీక రాజైన కోరెషు, దేవుని ప్రేరేపణతో యూదులకు అనుకూలమైన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించడానికి యూదులు తమ దేశానికి తిరిగి వెళ్ళవచ్చని అతడు ప్రకటించాడు. అంతేకాకుండా, నెబుకద్నెజరు దోచుకున్న దేవాలయపు బంగార, వెండి ఉపకరణాలను తిరిగి ఇచ్చాడు.
ఈ ఆజ్ఞను అనుసరించి, దాదాపు 47,000 మంది యూదులు జెరుబాబెలు (యూదా అధికారి) మరియు యెహోషువ (ప్రధాన యాజకుడు) నాయకత్వంలో బబులోను నుండి యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఇది క్రీ.పూ. 538లో జరిగింది.

4. దేవాలయ పునర్నిర్మాణము & ఆటంకములు
యెరూషలేముకు చేరుకున్న ప్రజలు ఉత్సాహంగా దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. పునాది వేసినప్పుడు వృద్ధులు, పాత దేవాలయ ఘనతను గుర్తుచేసుకుని ఏడ్చారు, యువకులు సంతోషంతో కేకలు వేశారు. అయితే, ఈ పని ఎక్కువ కాలం సాగలేదు.
- సమరేయుల చేసిన కుట్ర: చుట్టుపక్కల ఉన్న అన్యజనులు మరియు సమరియులు యూదుల పనికి ఆటంకం కలిగించారు. వారు పారసీక అధికారులకు లంచాలు ఇచ్చి, తప్పుడు ఫిర్యాదులు చేసి, నిర్మాణ పనిని నిలిపివేయించారు.
- ప్రజల యొక స్వార్థం: బాహ్య ఆటంకాలే కాకుండా, ప్రజలలో కూడా నిరుత్సాహం ఆవహించింది. “ఇది దేవుని మందిరమును కట్టించుటకు సమయం కాదు” అని వారు సాకులు చెప్పడం మొదలుపెట్టారు. దేవుని పనిని పక్కనపెట్టి, తమ సొంత ఇళ్లను, వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టారు. వారు తమ కోసం చక్కటి, పైకప్పు వేసిన ఇళ్లను కట్టుకుంటూ, దేవుని మందిరాన్ని మాత్రం శిథిలావస్థలోనే వదిలేశారు. ఒక మాటలో పట్టించుకోవడం లేదు. ఇలా 16 సంవత్సరాలు గడిచిపోయినయ్.
5. హగ్గయి ప్రవక్త సందేశం (క్రీ.పూ. 520)
ప్రజల ఈ నిర్లక్ష్య వైఖరిని సరిదిద్దడానికి దేవుడు క్రీ.పూ. 520లో హగ్గయి మరియు జెకర్యా అనే ప్రవక్తలను పంపాడు. హగ్గయి కేవలం 111 రోజుల పాటు (ఆగస్టు 29 – డిసెంబర్ 18 వరకు) నాలుగు ముఖ్యమైన వర్తమానాలను ప్రజలకు అందించాడు.
సందేశం 1 = మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి (ఆగస్టు 29)
హగ్గయి ప్రజలను సూటిగా ప్రశ్నించాడు: “ఈ మందిరము పాడైయుండగా, మీరు సరంబీ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా?” అని దేవుడు అడిగాడు. దేవుని పనిని నిర్లక్ష్యం చేయడం వల్ల వారు అనుభవిస్తున్న దుష్ఫలితాలను ఆయన ఎత్తిచూపాడు, అవి ఏమంటే
- మీరు విస్తారంగా విత్తనాలు చల్లుతున్నారు కానీ పంట కొంచెమే వస్తోంది.
- మీరు తింటున్నారు కానీ ఆకలి తీరడం లేదు.
- తాగుతున్నారు కానీ దాహం తీరడం లేదు.
- కష్టపడి సంపాదిస్తున్నారు కానీ, ఆ డబ్బు చినిగిపోయినా సంచిలో వేసినట్లుగా మాయమైపోతోంది.
దేవుని ఆశీర్వాదం లేకపోతే, ఎంత కష్టపడినా ఫలితం దక్కదని హగ్గయి స్పష్టం చేశాడు. వారి కరువు, ఆర్థిక ఇబ్బందులు, అసంతృప్తికి కారణం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడమేనని తెలియజేశాడు.
ప్రజల యొక్క స్పందన:
హగ్గయి మాటలు విన్న జెరుబాబెలు, యెహోషువ మరియు ప్రజలందరూ దేవునికి భయపడి, తమ తప్పును ఒప్పుకున్నారు. దేవుని వాక్యానికి లోబడి, మళ్లీ దేవాలయ నిర్మాణ పనిని ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. వారు పశ్చాత్తాపపడిన వెంటనే, “నేను మీకు తోడుగా ఉన్నాను” అని దేవుడు వారికి అభయమిచ్చాడు. క్రీ.పూ. 520, సెప్టెంబర్ 21న పని తిరిగి ప్రారంభమైంది.
సందేశం 2 = ధైర్యం తెచ్చుకొనుడి (అక్టోబర్ 17)
పని ప్రారంభించిన కొద్ది రోజులకే ప్రజలలో మళ్లీ నిరుత్సాహం మొదలైంది. సోలొమోను కట్టిన పాత దేవాలయంతో పోల్చుకుంటే, తాము కడుతున్నది చాలా చిన్నదిగా, అల్పుగా అనిపించింది. వారి దగ్గర తగినన్ని వనరులు, డబ్బు లేవని వారు ఆందోళన చెందారు.
అప్పుడు దేవుడు రెండవసారి హగ్గయి ద్వారా మాట్లాడాడు: “ధైర్యం తెచ్చుకోనుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను చేసిన నిబంధన మీ మధ్య ఉంది, నా ఆత్మ మీ మధ్య ఉంది, భయపడకండి.”
వెండి నాది, బంగారం నాది అని దేవుడు ప్రకటించాడు. రాబోయే కాలంలో ఈ మందిరపు మహిమ, పూర్వపు మందిరపు మహిమ కంటే గొప్పగా ఉంటుందని, ఈ స్థలంలో తాను సమాధానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇది భవిష్యత్తులో రాబోయే మెస్సీయ (యేసు క్రీస్తు) ద్వారా వచ్చే ఆత్మీయ మహిమను సూచిస్తుంది.
సందేశం 3 = పవిత్రత మరియు ఆశీర్వాదం (డిసెంబర్ 18 – ఉదయం న)
మూడవ సందేశంలో దేవుడు పవిత్రత గురించి ఒక ముఖ్యమైన పాఠం చెప్పాడు. యాజకులను ఒక ప్రశ్న అడగమన్నాడు: “పవిత్రమైన వస్తువును తాకినంత మాత్రాన అపవిత్రమైనది పవిత్రం అవుతుందా?” సమాధానం “కాదు”. కానీ “అపవిత్రమైన శవాన్ని తాకితే, పవిత్రమైన వ్యక్తి అపవిత్రుడు అవుతాడా?” సమాధానం “అవును”.
దీని అర్థం ఏంటంటే, కేవలం దేవాలయ నిర్మాణం చేయడం వల్ల ప్రజలు పవిత్రులు అయిపోరు. వారి హృదయాలు, ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. పాపం అనేది అంటువ్యాధి వంటిది, అది త్వరగా వ్యాపిస్తుంది. కానీ పవిత్రత అనేది వ్యక్తిగత సమర్పణ ద్వారా రావాలి. వారు తమ హృదయాలను శుద్ధీకరించుకుంటేనే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఆ రోజు నుండి వారిని ఆశీర్వదిస్తానని దేవుడు మాటిచ్చాడు.
సందేశం 4: జెరుబాబెలుకు వాగ్దానం (డిసెంబర్ 18 – సాయంత్రం న)
చివరిగా, దేవుడు నాయకుడైన జెరుబబెలుతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. “నేను ఆకాశాన్ని, భూమిని కంపింపజేస్తాను, రాజ్యాల సింహాసనాలను కూలదోస్తాను, కానీ నిన్ను నేను ముద్ర ఉంగరముగా (Signet Ring) చేసుకుంటాను” అని చెప్పాడు. ముద్ర ఉంగరం అనేది రాజు యొక్క అధికారానికి, ఎంపికకు గుర్తు. ఇది దావీదు సంతతిక చెందిన జెరుబాబలును దేవుడు ఎన్నుకున్నాడని, అతని ద్వారా మెస్సీయ వంశవృక్షం కొనసాగుతుందని తెలియజేసే గొప్ప వాగ్దానం.
6. హగ్గయి గ్రంథం నుండి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు
ఈ చారిత్రక సంఘటనల ద్వారా మనం అనేక ముఖ్యమైన పాఠాలను నేర్చుకోవచ్చు:
- ప్రాధన్యతలు (Priorities): మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మన సొంత పనులు, ఉద్యోగాలు, ఇళ్లు ముఖ్యం కాదని కాదు, కానీ దేవుని రాజ్యం, ఆయన నీతిని వెదకడం మన ప్రథమ కర్తవ్యం కావాలి (మత్తయి 6:33). దేవుని పనని నిర్లక్ష్యం చేసి, మన స్వార్థం చూసుకుంటే, మన సంపాదనలో తృప్తి ఉండదు.
- దేవుని సార్వభౌమాధికారం: మన జీవితంలో వచ్చే కష్టనష్టాలు, కరువు, లేదా వైఫల్యాలు కొన్నిసార్లు దేవుని నుండి వచ్చే శిక్ష లేదా హెచ్చరిక కావచ్చు. మన మార్గాలను సరిదిద్దుకోవడానికి దేవుడు పరిస్థితులను అనుమతిస్తాడు. ఆయన మన వెంట్రుకలను కూడా లెక్కించినవాడు గనుక, మనకు సంభవించే ప్రతిదీ కూడా ఆయన అనుమతితోనే జరుగుతుంది.
- పాపపు ఒప్పుకోలు మరియు విధేయత: ప్రజలు తమ తప్పును తెలుసుకున్నప్పుడు, వారు కేవలం బాధపడలేదు, కానీ వెంటనే పనిలోకి దిగారు. నిజమైన పశ్చాత్తాపం క్రియలలో కనబడాలి. దేవుని మాటకు లోబడి పనిచేయడమే నిజమైన భక్తి.
- దేవుని తోడ్పాటు: మనం దేవుని పని చేయడానికి పూనుకున్నప్పుడు, వనరుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. “నేను మీకు తోడుగా ఉన్నాను” అనే వాగ్దానం చాలు. వెండి, బంగారం ఆయనవే కాబట్టి, ఆయనే సమకూరుస్తాడు. మనం కేవలం మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి.
- పవిత్ర జీవితం: బాహ్యంగా చేసే సేవ, ఆరాధన లేదా ధర్మకార్యాలు మన అంతరంగిక అపవిత్రతను కప్పిపుచ్చలేవు. దేవుడు శుద్ధ హృదయాన్ని కోరుకుంటాడు. లోపల పవిత్రత ఉంటేనే, బయట చేసే సేవకు విలువ ఉంటుంది.
- ప్రతి ఒక్కరి పాత్ర: ఈ చరిత్రలో రాజులు, యాజకులే కాకుండా సామాన్య ప్రజలందరూ పాల్గొన్నారు. దేవుని సేవ కేవలం పాస్టర్లకు మాత్రమే పరిమితం కాదు. ఉద్యోగస్తులు, వ్యాపారులు, గృహిణులు – అందరూ దేవుని రాజ్య నిర్మాణంలో భాగస్తులే. ఎవరికి ఇచ్చిన తలాంతులను వారు వాడాలి. మనం “చూసేవారిగా” (spectators) కాకుండా “ఆడేవారిగా” (players) ఉండాలి.
ముగింపు మరియు పాఠం:
హగ్గయి గ్రంథం మనకు ఒక అద్దం లాంటిది. అది మన ప్రాధాన్యతలను ప్రశ్నిస్తుంది. “నా మందిరము పాడైయుండగా, మీరు మీ పనుల్లో బిజీగా ఉండటం న్యాయమా?” అనే ప్రశ్న నేటికీ మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని పని అంటే కేవలం చర్చి భవనం కట్టడమే కాదు, సువార్త ప్రకటించడం, సాటివారికి సహాయం చేయడం, ఆత్మీయంగా సంఘాన్ని కట్టడం. శ్రీదేవి అనే వికలగురాలైన సహోదరి మంచంపై ఉండి కూడా 800 మందిని ప్రభువు వైపు నడిపించిన సాక్ష్యం మనకు కనువిప్పు కావాలి. మనకున్న ఆరోగ్యం, వనరులు, సమయాన్ని దేవుని కోసం ఎంతవరకు వాడుతున్నామో ఆలోచించుకుందాం. దేవుని పనిని మన పనిగా స్వీకరిద్దాం. అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం, ఆశీర్వాదం మన జీవితాల్లో నిలిచి ఉంటుంది.
ఈ పాఠం & పుస్తకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే: దేవుని పనిని ఘనపరిస్తే, దేవుడు మన జీవితాలను ఘనపరుస్తాడు.










