అబ్రాహాము అను మాటకు “అనేక జనములకు తండ్రి” (Father of a Multitude) అని అర్థము. ఇది దేవుడతనికిచ్చిన పేరు (ఆది 17:5). తన తండ్రియైన తెరహు అతనికిచ్చిన నామము అబ్రాము. అబ్రాము అనగా “గొప్ప తండ్రి” (A High Father) అని అర్థము. ఈ రెండును ప్రవచన నామములని చెప్పతగును. ఇవి అబ్రాహాము యొక్క భవిష్యత్తును సూచించుచున్నవి. తెరహు తెలియకయే తన ప్రథమ పుత్రునకు అబ్రామని పేరు పెట్టునప్పుడు పరిశుద్ధాత్మ ప్రమేయం ఉంది. దేవుడు తరువాత ఆ పేరును మార్చినప్పుడు దానిని పూర్తిగ రద్దుచేయక, దానిలోని యర్థమును విషదపరచునట్లు ఆ పాత నామమునే కొద్దిగ మార్చెను. తెరహు ఇచ్చిన నామమునుబట్టి అబ్రాము ఎందులకు “గొప్ప తండ్రి” యగునో, దేవుడు మార్చిన “అబ్రాహాము” అను పేరు వివరించుచున్నది. అబ్రాహాము నిజముగ గొప్ప తండ్రియే. ఎలాగనగా, అతడు “అనేక జనములకు తండ్రి.” అబ్రాహాము శారీరకముగా మన ప్రభువైన యేసుక్రీస్తునకు తండ్రి. గనుక అతడు గొప్ప తండ్రియే. క్రీస్తునందు సకల జనములును ఏకము చేయబడెను. (ప్రక 5: 10).
"ఇదిగో ప్రతి జనములో నుండియు, ప్రతి వంశములో నుండియు, ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి, ఎవరును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను." (ప్రక 7:9).
యోహాను చూచిన ఈ గొప్ప సమూహము విశ్వాసుల సమూహము. విశ్వాసులు ప్రతి జాతిలోను, వంశములోను, ప్రజలలోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను ఉన్నారు. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, గనుక అతడు గొప్ప తండ్రియే.
దేవుడు అబ్రాహమును గొప్పవానిగ నెంచి గౌరవించెను. సౌదొను నాశన సందర్భములో యెహోవా “నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును.
ఎట్లనగా, యెహోవా అబ్రాహామునుగూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలును తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించునని నేనెరిగి యున్నాననెను" (ఆది 18 : 17, 19).
దీనినిబట్టి అబ్రాహాము దేవుని దృష్టిలో ఎంత ఘనుడో మనకు తెలియుచున్నది. దేవుడు అబ్రాహామును తన స్నేహితుడని పిలిచెను. స్నేహితుల మధ్య రహస్యములుండవు. (యోహా 15:15). దేవుడు అబ్రాహాముకు తన హృదయ మర్మములను బయలుపరచెను.
దేవుడు అబ్రాహామును ఘనముగా నెంచెను. వరిశుద్ధాత్ముడు బైబిలు గ్రంథమును వ్రాయించినప్పుడు సృష్టి మొదలు 2000 సంవత్సరములకంటె ఎక్కువైన కాలచరిత్రను 11 అధ్యాయములలో ముగింపజేసి, 175 సంవత్స రముల అబ్రాహాము జీవితమును వ్రాయించుటకు 14 అధ్యాయముల నుపయోగించెను.
ఆబ్రాహాము చరిత్ర ప్రపంచ చరిత్రలో చాల ప్రాముఖ్యమైనది. అతనితోనే ప్రపంచములో నొక నూతన ఆధ్యాత్మిక యుగమును, క్రమమును ప్రారంభమాయెను. మానవ జాతియను నదీప్రవాహము రెండువేల సంవత్సరములు ప్రవహించిన తరువాత, దేవుడు దానినుండి యొక చిన్న శాఖను వేరు చేసెను. అదియే అబ్రాహాము సంతానము. ఆ సంతానమునకు దేవుడు తన్ను తాను బయలు పరుచుకొనెను; వారికి నీతియందు శిక్షణ ఇచ్చెను; వారినే తన సొత్తయిన ప్రజలుగా చేసికొనెను. ఈ సంతానమందు క్రీస్తు జన్మించెను. ఆయనద్వారా లోకమును రక్షించుటకు దేవుడు సంకల్పించెను. ఈ ప్రవాహము యొక్క ప్రారంభ స్థానము అబ్రాహముతోనే ఆరంభము అయ్యింది. దేవునియొక్క రక్షణ సంకల్పములో అబ్రాహామన కొక ప్రముఖ స్థానము కచ్చితంగా ఉంది. అతడు దేవు డేర్పరచుకొనిన జనాంగమునకు మూలపురుషుడు. అబ్రాహాము యొక్క జీవిత కథ హెబ్రీయుల దేశ చరిత్రకు పునాదియై యున్నది.
అబ్రాహాము యొక్క జన్మస్థానము – Abraham Born Place Telugu
అబ్రాహాము కల్దీయుల దేశమందలి ‘ఊరు’ అను పట్టణమున బహుశ క్రీ.పూ 2008 వ సంవత్సరమున జన్మించెను. (తేదీలు నిశ్చయములు కావు). ఈ దేశము మెసపొతేమియా మైదానముయొక్క దక్షిణ భాగమున యూఫ్రటీసు, టైగ్రీసు అను నదులమధ్యనున్నది. దీనికి బైబిలులో షీనారు, బబులోను అను నామములుకూడ గలవు. “ఊరు” పట్టణము కల్దీయ దేశముయొక్క దక్షిణమున యూఫ్రటీసు నదియొక్క కుడిగట్టున నున్నది. ఆ కాలమున ఈ నది వర్తకమునకు ప్రసిద్ధి కెక్కిన ‘యొక ముఖ్యమైన సముద్రపు రేవుగా నుండెను.

అబ్రాహాము కాలమున అమోరీయుల సంబంధులు కల్దీయుల దేశము నేలుచుండిరి. వీరు బహుళః క్రీ. వూ 2226 వ సంవత్సర ప్రాంతమున నీ దేశమునకు వచ్చి దానిని ఏల ఆరంభించారు. వీరి రాజులలో “హమ్మురబి” అను నతడు అబ్రాహాము యొక్క సమకాలికుడు. ఇతడు వీరి యారవ రాజ్య వంశ మునకు చెందినవాడు. బైబిలులో “షీనోరు రాజైన ఆమ్రాపేలు” అనువాడు ఇతడే (ఇది 14:1), ఇతడు కొన్ని ప్రసిద్ధికెక్కిన చట్టములను పెట్టాడు. ఇతని చట్టములకును, మోషే ధర్మశాస్త్ర చట్టములకును కొన్ని సమాన లక్షణములు గలవు. కాని మోషే ధర్మశాస్త్రము ఈ చట్టములనుండి సంగ్రహింపబడెననుట కేవలము అసంభవమును, బైబిలు బోధకు విరుద్ధమునై యున్నది.
అబ్రాహాము యొక్క వంశము – Abraham Family Line Telugu
అబ్రాహాము షేము సంతతివాడు. నోవహునకు ముగ్గురు కుమారులు. యాపెతు జ్యేష్ఠుడు; షేము మధ్యముడు: హాము కనిష్ఠుడు. మొత్తముమీద యాపెతు సంతానము యూరపు ఖండమును, షేము సంతతి ఆసియా ఖండమును, హాము సంతతి ఆఫ్రికా ఖండమునకు పయనించి జీవించిరి అని చెప్పవచ్చును. ఆదామునుండి నోవహు పదియవ తరమువాడు; షేమునుండి అబ్రాహాము పదియవ తరమువాడు; తామారునందు యూదా కుమారుడైన పెరెసునుండి దావీదు పదియవ తరమువాడు. (రూతు 4:18, 21). బైబిలులో పదియవ సంఖ్య 7వ సంఖ్యవలె విశేషమైనది; బాధ్యతాయుతమైనది. (ఉదాహరణకు:- పది తెగుళ్ళు, పది ఆజ్ఞలు, పది తలాంతులు, పది మీనాలు, పదిమంది కన్యకలు, పదిమంది కుష్ఠురోగులు, ఏడవ నెలలో పదియవ దినము ప్రాయశ్చిత్తదినము, సొదొమ రక్షణ కవసరమైన పదిమంది నీతిమంతులు, పరిశుద్ధాత్మకొరకు కనిపెట్టవలసిన పది దినములు మొదలైనవి.)
నోవాహు తన పుత్రులను గురించి ప్రవచించుచు, హాము సంతతిని శపించి, యాపెతు, షేము సంతతులను దీవించెను, హామును తన ఇద్దరి సోదరులకు దాసునిగను, షేమును ముగ్గురి సోదరులలో శ్రేష్ఠునిగా నియమించెను (ఆది 9 : 25, 26, 27). యాపెతును విశాలపరచుచు, అతడు షేము గుడారములో నివసింప శాసించెను. షేము అనగా, “ప్రఖ్యాతి” అని అర్థము. షేము సంతతి నుండి అబ్రాహామును, అతని సంతతినుండి క్రీస్తును వచ్చిరి. ఇదియే షేముయొక్క ప్రఖ్యాతి. రాబోవుచున్న క్రీస్తునుబట్టి షేముకు ప్రఖ్యాతి వచ్చెను. దేవుడు “షేము దేవుడైన యెహోవా” అనుచు తన నామమును. షేము నామముతో కలుపుకొనెను (ఆది 9:26). తరువాత తాను అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలుచుకొనెను. షేముకు ఐదుగురు కుమారులు కలిగిరి. వారిలో మూడవవాడు అర్పక్షదు. ఇతడు షేముకు నూరేండ్లప్పుడు, అనగా, జలప్రళయము తరువాత రెండు సంవత్సరములకు జన్మించెను. ఇతని మనుమడును, షేము యొక్క మునిమనుమడును నైన ఎబెరు లేక హెబెరు అను నొకడుండెను. అతని పేరునుబట్టి అబ్రాహాము సంతతి హెబ్రీయులనబడిరి. వీరు తరువాత యాకోబునుబట్టి ఇశ్రాయేలీయులనియు, యూదానుబట్టి యూదులనియు పిలువబడిరి. దేవునివలన ఏర్పరచబడి, ప్రత్యేకింపబడి, దీవింపబడిన వంశమునుండి అబ్రాహాము వచ్చెను. దేవుడతనియందు సర్వలోకమును దీవింప సంకల్పించెను.
అబ్రాహాము యొక్క మతము – Abraham Pagan Religion
కల్దీయులు సేబియను మతస్థులు. వీరు విగ్రహారాధకులు. సూర్య, చంద్ర, నక్షత్రాదుల నారాధించువారు. వారు ముఖ్యముగ “సీను” అను చంద్ర దేవత నారాధించుచుండిరి. అబ్రాహాము తండ్రియైన తెరహు విగ్రహారాధకుడు మాత్రమేగాక విగ్రహములను చేసి వాటిని విక్రయించు వృత్తి గల వాడు. కావున అబ్రాహాము బాల్యమునుండియు విగ్రహారాధకుడుగా పెంచబడెను.
యెహోషువ జనులందరితో ఇట్లనెను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి. - యెహోషువ 24:2
కాని అతడు నిజ మతాన్వేషణా పరుడయ్యెను. ఇతని మత మార్పును గూర్చి యూదులలోను, మహమ్మదీయులలోను చక్కని ఇతిహాసములు కలవు. అవేవన :
1. అబ్రాహాము దాదాపు పదునాలుగేండ్లప్పుడు అతనిలో మత దీక్ష ప్రారంభామాయెను. ఒకరాత్రి ఆకాశ విశాలములో మెరయుచున్న అసంఖ్యాకములగు నక్షత్రములనుచూచి, ఇవియే నా దేవుండ్లని వాటికి నమస్కరించెను, కాని కొంతసేపటికవి క్రమక్రమముగా వేల్లిపోవుట మరియు కనిపించకుండుట చూచి నిరాశచెంది, ఆకాశమున ప్రకాశమానమైన చంద్రుడు అతనికి కనిపించెను. దానిని చూచి అతడు సంతసించి, ఇదియే నా దేవుడని చంద్రునికి నమస్కరించెను. కాని చంద్రుడుకూడ అస్తమింప, నతడు మిగుల నిస్పృహ చెందెను. తరువాత సూర్యోదయముకాగా, తేజోమయుడైన సూర్యుని చూచి ఇతడే నా ప్రభువని నమస్కరించెను. కాని సూర్యుడు కూడ కొంతసేపటికి అస్తమించెను. అప్పుడు అబ్రాహాము లేచి అస్తమించు దేవుండ్లు నాకక్కరలేదు. సర్వమును కలుగజేసిన సృష్టికర్తనే నేను ఆరాధించెదననుచు విగ్రహారాధనను విసర్జించెనని చెప్పుదురు.

2. ఒకనాడతడు దేవాలయములోనికి బోయి అందలి చిన్న విగ్రహముల నన్నిటిని ధ్వంసముచేసి పెద్దవాని నుండనిచ్చెను. మరునాడు ప్ర లతనిని ప్రశ్నింపగా – అతడు “బహుశః పెద్ద దేవుండ్లు చిన్నవారిని హతమార్చియుందురు, వారినే యడుగుడు” అనెను. అవి మాటలాడనేరవని వారు చెప్పగా, “మాట్లాడలేని మూగ విగ్రహములను దేవుండ్లని కొలుచుట యవివేకము కాదా ?” అని వారి నపహసించెనట. అంతట వారు అత్యాగ్రహులై అతనిని అగ్ని గుండములో పడవేయ చూడగా, అద్భుతరీతిని తప్పించుకొనెనని చెప్పుదురు. ఇవి కట్టుకథలైనను, అవి అబ్రాహాముయొక్క నైతిక ధైర్యము, పట్టుదల, మత దీక్ష, సత్యాన్వేషణ, దైవభక్తి మొదలగు ఉత్తమ గుణ లక్షణములను చాటుచున్నవి.
అబ్రాహాము యొక్క పిలుపు – The calling of Abraham
మరచిపోవుట మానవుని సహజ లక్షణము. ఎంత కఠిన శిక్షలైనను, ఎట్టి అద్భుత కార్యములైనను, ఎంతటి యాశ్చర్య కృత్యములైనను, మనుష్యుడు అతి శీఘ్రముగ మరచిపోవును. కావుననే దావీదు, “దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మఱువకు” మని తన్ను తాను హెచ్చరించుకొనెను. (కీర్త 108 :2).
దేవుడు ఐగుప్తు మీదికి పంపిన పది తెగుళ్ళను, తన్మూలముగ వారికి లభ్యమైన అద్భుతమగు దాస్యవిముక్తిని, ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రమును చేరుసరికే మరచిపోయిరి. తరువాత వారికి కలిగిన ఎఱ్ఱ సముద్రానుభవమును కూడ త్వరిత స్థితిని మరచిరి. ఇట్లు ఇశ్రాయేలీయులు తమ 40 సంవత్సరముల అరణ్య ప్రవాసమున ఎన్నోమారులు వారనుభవించిన కఠిన శిక్షలను, అద్భుత రక్షణ కార్యములను మరచి పాపము చేయుచుండిరి. దీనిని ఆసాపు చక్కగ కీర్తనల గ్రంథమందు వివరించెను (కీర్తన 78).
అదేవిధముగా నోవహు సంతతియు జలప్రళయమును భయంకరానుభవమును పొంది ఆ శిక్షనుండి తప్పించుకొనిన తమ పితరులు తమ మధ్య నింకను సజీవులై యుండినను వారా సంగతి మరచి తమ వితరుల దేవుని మార్గముల నుండి తొలగిపోయిరి. ఏలయన, నోవహు జలప్రళయము తరువాత 850 సంవత్సరములును, షేము 500 సంవత్సరములును బ్రతికిరి. భాషల తారుమారు జల తరువాత దాదాపు 100 సంవత్సరములకే జరిగెను. అబ్రాహాము జలప్రళయము తరువాత షుమారు 350 సంవత్సరములకు జన్మించెను. అనగా అబ్రాహాము జనన కాలమున బహుశః నోవహు ఇంకను సజీవుడై యుండెనన్నమాట. అయినను ఆనాటి ప్రజలు ఆశ్చర్యముగా తమ దేవుని మరచి విగ్రహారాధకులైరి. కావున దేవుడు తన రక్షణ సంకల్పమును నెరవేర్చుకొనుటకై మరియొక పురుషుని కొరకు వెదకుచుండెను. ఆ పురుషుడే అబ్రాహాము. “ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని” అని యెహోవా దేవుడు ఆనాడు నోవహును గురించి వలికిన మాటలు ఈనాడు అబ్రాహాము యెడలను సత్యమనతగును. (ఆది 7:1).
కయీను పాపము చేయగా దేవుడతనికి ప్రతిగా షేతును ఏర్పరచుకొనెను. షేతు సంతతి కయీను సంతతితో కలిసి పాపము చేయగా వారిని జలప్రళయముచే నాశనము చేసి, వారినుండి నోవహు నేర్పర్చుకొనెను. నోవహు సంతతిలోనుండి షేము నేర్పరచుకొనెను. షేము కుమారులలో నుండి తృతీయుడైన అర్పక్షదు నేర్పర్చు కొనెను. ఈ అర్పక్షదు సంతతి వాడే అహ్రాబాము. ఇతడు దేవుని చిత్తానుసారమైన మనస్సుగల మనుష్యుడు (1 సమూ 13:14). అతడు దేవునికి బహు ప్రియుడు. (దానియేలు 10:19). అతనిని దేవుడు “ఊరు” అను పట్టణములో విగ్రహారాధకులమధ్య కనుగొని తన ఉన్నత సేవ కొరకు పిలిచెను.
ఆదికాండములో నీ పిలుపు అబ్రాహాముకు కల్దీయుల దేశములో వచ్చినట్లు కనబడదు. తెరహు తన స్వచిత్తానుసారముగా కుటుంబముతో “ఊరు” నుండి కానాను పోవుటకు బయలుదేరినట్లగపడును (ఆది 11:31). కాని ఆత్మావశుడైన స్తెఫను తాను సన్హెద్రిను సభ ఎదుట చేసిన ప్రసంగమందు దేవుడు అబ్రాహామును కల్దీయుల దేశమందలి “ఊరు” నందున్నప్పుడే పిలిచినట్లు చెప్పెను. (ఆపొ. కా. 7:2,3). అప్పటికి అబ్రాహాము శారాయి అను చక్కని యువతిని వివాహమాడియుండెను. శారాయి అను మాటకు “నా రాకుమారి/ రాజకుమారి” అని అర్థము. ఈమె తెరహు యొక్క మరియొక భార్యకు కలిగిన పుత్రిక (అది 20: 12), హారాను అప్పటికి మృతిబొందియుండెను. తెరహు యొక్క ద్వితీయ పుత్రుడైన నాహోరు, తన చిన్న సోదరుడైన హారాను కుమార్తె మిల్కాను వివాహమాడి యుండెను, హారాను కుమారుడైన లోతు అప్పటికి అవివాహితుడు. వీరందరు తమ యావదాస్తితో బయలుదేరి ఉత్తరమున 800 మైళ్ళదూరమందు అరాము దేశములోనున్న హారాను వరకువచ్చి అచ్చట చాల కాలము అనగా తెరహు మృతిబొందు వరకు నిలిచిపోయిరి. ‘హారాను’ యూఫ్రటీసు నదియొక్క ఒకచిన్న ఉపనది మీద నున్నది.
తెరహు 205 సంవత్సరముల వయస్సుగలవాడై మృతిబొందిన తరువాత దేవుని యొక్క పిలుపు అబ్రాహాముకు రెండవమారు వచ్చెను.
“యెహోవా - నీవు లేచి నీ దేశమునుండియు, నీబంధువులయొద్దనుండియు, నీ తండ్రి యింట నుండియు బయలుదేరి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము” అని అబ్రాహాముతో చెప్పెను ( ఆది 12 : 1).
ఇందు సువార్త పిలుపు యొక్క లక్షణములున్నవి. ఈ పిలుపునందు దేవుడు ఏడు అమూల్య వాగ్దానములను ఉంచాడు. ఆవేవన :
(1) నిన్ను గొప్ప జనముగా చేసెదను
(2) నిన్ను ఆశీర్వదించెదను
(3) నీనామమును గొప్ప చేనెదను
(4) నీవు ఆశీర్వాదముగా నుందువు
(5) నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను
(6) నిన్ను దూషించు వారిని శపించెదను
(7) భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును (ఆది 12:2,3)
దేవుని పిలుపు వాగ్దానములతో కూడినదైయుండును. అయినను అబ్రాహాముకు వచ్చిన పిలుపు కష్టతరమైనది. ఎట్లనగా, అబ్రాహాము తన బంధువర్గ మంతటిని విడువవలసి వచ్చెను. అప్పటికి అబ్రాహాముకు ఎందరో బంధువులుండిరి. తన సోదరుడైన నాహోరును విడువ వలసి వచ్చెను. నాహోరునకు ఎనమండుగురు కుమరులు. వారిలో కనిష్ఠుడు బెతూయేలు. ఇతడు యాకోబుయొక్క తల్లియైన రిబ్కా, లాబానులకు తండ్రి. వీరి నందరిని విడువవలసి వచ్చెను. మరియు ఈ పిలుపునకు విధేయత మాత్రముగాక విశ్వాసముకూడ అవసరమై యుండెను. దేవుడు అబ్రాహామునకు తాను వెళ్లవలసిన దేశము పేరు చెప్పియుండలేదు. “నేను నీకు చూపించు దేశ”మని మాత్రము చెప్పెను. ఇట్టి పిలుపుకు విధేయుడగుట చీకటిలోనికి దుమికినట్లుండెను. అబ్రాహాము ఎరుగని దేశమును, చూడని విత్తనమును, తెలియని దీవెనను వెదకుచుపోయెను.
అబ్రాహము దేవుని నమ్మెను అది యతనికి సీతిగా నెంచబడెను - ఆది 15 : 68
దేవుడెవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను : ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను” (రోమా 8 : 30). ఈ మాటలు అబ్రాహామునందు సత్యములాయెను. పరమందు అబ్రాహామునకు ఒక ఘనమైన స్థానమియ్యబడెను (లూకా 16 : 28-81) అబ్రాహాము దేవుని పిలుపు విని దానికి విధేయుడై, అనుమానించక, కష్టములనెంచక, బయలుదేరి అనుదినము దేవునిచే నడిపింప బడుచు 800 మైళ్ళు యెడారిమార్గమున ప్రయాణముచేసి కానాను దేశము చేరెను. ‘కానాను’ అను మాటకు “పల్లవుభూమి” అని అర్థము. కనానీయులు శపింపబడిన హాము సంతతివారు. వీరు మొదట అరేబియా తీరప్రాంతముల నివసించుచు తరువాత ఉత్తరముగాను పడమరగాను వ్యాపించి పాలస్తీన దేశము యొక్క పశ్చిమ భాగము నాక్రమించిరి. వీరు దేవుని నెరుగని ప్రజలు. విగ్రహారాధకులు; వీరికిని అబ్రాహాముకును ఏ సహవాసమును సాధ్యముకాదు. అతడు వారి మధ్య పరదేశిగా నుండెను. అందువలన అబ్రాహాము సహవాసమంతయు దేవునితోనే యుండెను. అతడు దేవుని స్నేహించెను గనుక గొప్పవాడాయెను. అందువలన ఆబ్రాహాము విశ్వాసులకును, విధేయులకును, తండ్రియాయెను.
అబ్రాహాము యొక్క ప్రయాణములు
ఆబ్రాహాము యొక్క జీవితములోని ప్రాముఖ్య ఘట్టములన్నియు అతడు చేసిన ప్రయాణములకు సంబంధించినవి. అతని జీవిత మంతయు ఓక యాత్రికుని ప్రయాణమని చెప్పవచ్చును. అబ్రాహాము తన 175 సంవత్సరముల జీవితములో 18 ప్రయాణములు చేసెను; తొమ్మిది స్థలములలో నివసించెను; నాలుగు బలిపీఠములను కట్టెను. ఈ ప్రయాణములలో మొదటి రెండును చరిత్రాత్మకమైన ప్రాముఖ్యత గలవి. అందులో
అబ్రాహము మొదటి ప్రయాణము: ఊరు నుండి హారాను వరకు చేసిన ప్రయాణము. ఇది 650 మైళ్ళదూరము.
అబ్రహాము రెండవ ప్రయాణము: హారాను నుండి కానానులోని షెకెము వరకు చేసిన ప్రయాణము. ఇది దాదాపు 800 మైళ్ళ దూరము, ఇవి విశ్వాస ప్రయాణములే. ఇట్టివి ఏ యేక కుటుంబమును ఎన్నడును చేసియుండలేదు. ఇవి ప్రపంచ చరిత్రను మార్చిన ప్రయాణములు. వీటి ప్రాముఖ్యత ఈ క్రింది దైవ వాక్యమును బట్టి స్పష్టమగుచున్నది.
అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపుకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎచ్చటికి వెళ్ళవలయునో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమునుబట్టి అతడు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి. ఏలయనగా, దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణికుడునై యున్నాడో, పునాదిగల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను -హెబ్రీ. 11:8-10
కనానులో అబ్రాహాముయొక్క మొదటి విశ్రమస్థలము షెకెము. ఇది ఎఫ్రాయీము మన్యపు ప్రాంతమున గెరెజీము కొండయొక్క పాదతలమున నున్నది. ఇది పాలస్తీన మద్యస్థానము నలంకరించుచున్నది. ఈ ప్రాంతము ఆ దేశములోనికెల్ల మిక్కిలి సుందరమైనదని చెప్పుదురు. అక్కడ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమాయెను. అబ్రాహాము తన మొదటి బలిపీఠమును అచ్చటనే కట్టి దేవునిని ఆరాధించెను. ఇది బైబిలులో మూడవ బలిపీఠము. మొదటి బలిపీఠమును హేబెలు కట్టెను. రెండవది నోవహు కటైను. మొదటి రెండు బలిపీఠముల మధ్య దాదాపు 1650 సంవత్సరముల వ్యవధియు, రెండవ మూడవ బలిపీఠములమధ్య దాదాపు 350 సంవత్సరముల వ్యవధియు నుండెను. ఆ కాలములో కనానీయులు ఆ దేశములో నివసించిరి. వారిమధ్య అబ్రాహాము నిర్మించిన ప్రథమ బలిపీఠము తన నిజ దైవారాధనకొక బహిరంగ సాక్ష్యముగ నుండెను. షెకెము ప్రస్తుతమున ‘నెబ్లస్’ అను పేరున పిలువబడుచున్నది.
అబ్రాహాము షెకెములో ఎంతకాల =ముండైనో మనకు తెలియదు. అతడు షెకెమునుండి దక్షిణముగ ప్రయాణము చేయుచు దాదాపు 20 మైళ్ళ దూరముననున్న బేతేలుకు చేరి అక్కడ మరియొక బలిపీఠమును కట్టెను. బేతేలు అనగా “దేవుని మందిరము” అని అర్థము. ఈ పేరు ఈ స్థలమునకు యాకోబిచ్చెను – (ఆది. 23 : 19). అబ్రాహాము కాలమున దాని పేరు ‘లూజు’· అతడు ఇంకా ప్రయాణముచేయుచు దక్షిణ దిక్కునకు వెళ్లెను. ఈ ప్రదేశమునకు ‘నెగేబు’ అని పేరు. నెగేబు అనగా “ఎండినభూమి” అని అర్థము.
కనాను దేశములో కరువు రాగా అబ్రాహాము తన యావదాస్తితో ఐగుప్తుకు పోయెను. అప్పుడు ఐగుప్తును హక్సాస్ అను గొర్రెల కాపరి రాజులు ఏలుచుండిరి. వీరు ఆసియానుండి వచ్చినవారు. వీరి బిరుదులు “ఫరో”. ఆ కాలమున ఐగుప్తు ఎక్కువ నాగరికతను కలిగియుండెను. ఐగుప్తులోని “పిరమిడు” లను మహా కట్టడములు చాలమట్టుకు అబ్రాహామునకు ముందే కట్టబడెను.
అబ్రాహాము బేతేలులో ఉన్నప్పుడు లోతు సేవకులకును తన సేవకులకును కలహము వచ్చెను. కలహకారణము తమకున్న అధిక ఆస్తియే. ఈ తగవునందు అతడు తన ఉదారబుద్ధిని కనుపరచెను. అబ్రాహాము సమాధాన ప్రియుడు. కాని “నమాధానమును వెదకి దానిని వెంటాడుము” (కీర్తన 84 : 14) అన్నట్లు దానికొరకు తన సర్వాధిక్యతలను, అవకాశములను, హక్కులను, లాభములను, స్వేచ్ఛాపూర్వకముగ వదలుకొని తనకు ఇష్టమైన ప్రాంతమును కోరుకొనుటకై లోతుకు పూర్ణ స్వాతంత్ర్యమును అబ్రాహాము ఇచ్చెను. స్వార్థపరుడైన లోతు శ్రేష్ఠమైన యోర్దాను నదీ లోయ ప్రాంతమును కోరుకొనగా ఆబ్రాహాము నిస్సారమైన ప్రాంతమునకు పోయెను. కాని నష్టపోలేదు. దేవుని సన్నిధి అతనితో కూడ వెళ్ళెను. మనము సమాధానము కొరకేమి కోల్పోయినను దేవుడు మనలను నష్టపడనీయడు. అబ్రాహాము యొక్క వింతచర్యకు వెనుకనున్న మనస్సు ఆదికాండము 18:8 లో కనబడుచున్నది: “మనము బంధువులము గనుక నాకును నీకును కలహముండ కూడదు”. కాని ఆస్తుల కొరకు బంధువులే కలహ పడుచున్నారు, వ్యాజ్యమాడుచున్నారు ఈ రోజులల్లో. కాని వాక్యమేమి చెప్పుచున్నది?
ఒకనిమీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలుకాదా ? దానికంటె మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా ? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు; అపహరించుచున్నారు; మీ సహోదరులకే యీలాగు చేయుచున్నారు - 1 కొరింథి. 6: 7-8
ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము - 1 తిమో 6:10
లోతు, అబ్రాహాములు విడిపోయిన వెంటనే దేవుడతనికి ప్రత్యక్షమై తాను మునువు అతనితో చేసిన నిబంధనను మరల స్థిరపరచెను (ఆది 18 :14-17). అబ్రాహాము బేతేలునుండి ఇంకను దక్షిణముగ ప్రయాణము చేయుచు హెబ్రోనుకు వచ్చి అచ్చట తన మూడవ బలిపీఠమును కట్టి దేవునికి ప్రార్ధన చేసెను. కొందరు తమ జీవిత మార్గము పొడుగున జగడము, ద్వేషము, పగ, కలహము, అహంకారము మొదలగు ఆనవాళ్ళు విడుచుచు పోవుదురు. అబ్రాహామైతే తన యాత్రమార్గములో బలిపీఠములను ఆనవాళ్ళుగా విడిచివెళ్లెను. మనము మన జీవిత మార్గములో ఏలాంటి అనవాళ్ళను విడుచు చున్నాము?
లోతుయొక్క స్వార్ధము అనతికాలముననే ఫలించెను. లోతు సిద్దీము లోయలోని సోదొమయందు నివసించుచుండెను. దీనికి పంచపట్టణప్రాంతము (Pentapolis) అని పేరు. సోదొమ ఆ పట్టణములలో నొకటి. శత్రురాజు ప్రదేశముమీదికి దండెత్తి, ఐదు పట్టణ రాజులను ఓడించి వారి ఆస్తిని కొల్లగొని ప్రజలను చెరపట్టిరి. లోతును, అతని కుటుంబమును, ఆస్తిని, చెరగొనిపోయిరి. ఈ వార్త అబ్రాహామునకు తెలియగనే అతడు తన యింటనున్న 818 మందిని; ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను తన ముగ్గురు స్నేహితులను పరివారమును వెంటబెట్టుకొని దమస్కు వరకు శత్రురాజులను తరిమి, రాత్రివేళ అకస్మాత్తుగా వారిమీదపడి, ఓడించి వారు కొల్లగొనిన యావదాస్తిని, చెరపట్టిన జనమును విడిపించి తీసికొని వచ్చెను. అట్లు లోతు పోగొట్టుకొనిన సమస్తమును తిరిగి సంపాదించి అతని కిచ్చివేసెను. సోదొమరాజు కొల్లధనమును బహుమతిగ నివ్వబోగా అబ్రాహాము దానిని నిరాకరించెను. (ఆది. 14:22, 23). అబ్రాహాము యొక్క ధైర్యసాహసములు, యుద్ధకౌశీలత, కార్యధీరత్వము, ఉదార భావము, స్వార్థరాహిత్యము, త్యాగము, విశ్వాసము మొదలగు లక్షణములు ప్రతిబింబచేయును.
అబ్రాహాము తిరిగివచ్చునప్పుడు షాలేమురాజు అతని నెదుర్కొని, అతనికి భోజన పానాది సత్కారముల నొసగి దేవుని పేరట అతనిని దీవించెను. అబ్రాహామతనికి దశమాంశములనర్పించెను. “అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు” అని అతనిని గూర్చి చెప్పబడెను (ఆది 14: 18). ఇతని యాజక క్రమము మెల్కీసెదకు క్రమమని చెప్పబడెను (కీర్తన 110:4; హెబ్రీ. 5:6,9; 7:8.) ఇతని యాజకత్వము రాజ సంబంధమైనది (Royal Priesthood), నీతి సంబంధమైనది, సమాధాన సంబంధమైనది, వారసత్వమునుబట్టి గాక స్వసంపాద్యముగా వచ్చిన నిరంతర యాజకత్వము. గనుక ఈ అబ్రాహాము క్రీస్తుకు ముంగుర్తుగానున్నాడు.
అబ్రాహాము నివసించిన ప్రాంతములలో హెబ్రోను ముఖ్యమైనది. ఇచ్చటనే ఇస్సాకును గూర్చిన వాగ్దానము రెండవ మారతనికివ్వబడెను. ఇచ్చటనే ఇష్మాయేలు జన్మించెను. ఈ స్థలమందే దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను అగ్నిదర్శనము ద్వారా మరల స్థిరపరచెను. ఇచ్చటనే దేవుడతని పేరును మార్చెను. అబ్రాహాము సొదొమ వక్షమున తన ప్రసిద్ధమైన విజ్ఞాపనా సభాషణను దేవునితో చేసిన స్థలమిదియే. ఇచ్చటనే అబ్రాహామును, శారాయు, మృతిబొంది పాతిపెట్టబడిరి. అబ్రాహాము హెబ్రోనులో నుండగా కరవు రెండవమారు వచ్చెను. ఈ కరవును తప్పించుకొనుటకు ఈసారి అబ్రాహాము గెరారుకు వెళ్ళెను. ఆ కాలమున అబీమెలెకు అనురాజు గెరారును పాలించుచుండెను. గెరారు మధ్యధరా సముద్ర తీర ప్రాంతముయొక్క దక్షిణమున నుండెను.

ఇచ్చట కూడా అబ్రాహాము ఐగుప్తులో అబద్దం చెప్పిన విధముగానే తన భార్యనుగూర్చి అబద్ధమాడెను. ఇచ్చటనే బహుషా ఇస్సాకు జన్మించి యుండవచ్చును. అబ్రాహాము గెరారునుండి తిరిగి వచ్చినప్పుడు హెబ్రోనుకు వెళ్లక బెయేర్షబాకు వెళ్ళెను. బహుశ అబ్రాహాము బెయేర్షబాలో నున్నప్పుడు అతడు హాగరును, ఇష్మాఎలును తన యింటనుండి పంపివేసెను. ఇచ్చటనే ఆబీమెలెకు అబ్రాహాముతో సంధిచేసికొనెను. ఇచట నుండియే దైవాజ్ఞ ప్రకారము అబ్రాహాము మోరీయా కొండకు వెళ్ళి దానిమీద తన కుమారుడైన ఇస్సాకును దహనబలిగా నర్పింప పూనుకొనెను. మోరీయా కొండమీద తాను కట్టిన నాల్గవ బలిపీఠముమీద దైవాజ్ఞానుసారముగ ఇస్సాకుకు బదులు ఒక పొట్టేలు నర్పించి తిరిగి వచ్చెను. తరువాత అబ్రాహాము బెయేర్షబానుండి హెబ్రోనుకు మరల వచ్చి అచటనే మరణాంతము వరకు నివసించెను. ఇచ్చటనే ఇస్సాకు రిబ్కాను పరిణయమాడెను/వివాహమాడెను. ఇచ్చోటనే అబ్రాహాము కూడ తన వృద్ధాప్యములో శారా మరణించిన తరువాత కెతూరాను వివాహమాడి ఆమెయందు ఆరుగురు పుత్రులను కనెను. మరియు ఇస్సాకు పుత్రులును, తన మనుమలునైన ఏశావు యాకోబుల జననమును కండ్లారా చూచెను. వారు పదునైదేండ్ల బాలురగు వరకు వారి మధ్య తన చివరి దినములు గడిపెను.
అబ్రాహాము యొక్క పరీక్ష
అబ్రాహాము దేవునికి బహుప్రియుడు. అతడు ఆశీర్వదింపబడినవాడు. “అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను” (ఆది. 24:1). గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండిబంగారములను, దాసదాసీజనమును, ఒంటెలను, గాడిదెలను దయచేసెను” (ఆది 24 : 36), మరియు ఐగుప్తు రాజైన ఫరోయు, గెరారు రాజైన అబీమెలెకును ఇచ్చిన బహుమతులు (ఆది. 12:16; 20:14) అతని ఆస్తిపరునిగా జేసెను. అబ్రాహాముకు కొదువయేమియు లేకుండెను. అతనికి సంతానలేమియను ఒకేఒక్క కొదువను కూడ దేవుడు తీర్చెను. అబ్రాహాము కనానీయుల మధ్య ఒక మహారాజువలెనుండెను (ఆది. 28 : 6). రాజులతనితో సంధిచేసికొనుచుండిరి. ఒక సమయమున ఒక రాజతనిని మార్గములో నెదుర్కొని భోజన పానాదుల నిచ్చి సత్కరించెను (ఆది. 14:18). అతని సహవాసము దేవునితోనుండెను. దేవుడే యతనితో స్వేచ్ఛాపూర్వకముగ నొక నిబంధనను చేసికొనెను; అతనిని తన స్నేహితునిగా ఎంచెను; అతనిని ఆశీర్వాదముగా జేసెదనని వాగ్దానము చేసెను..
అబ్రాహాము ఇట్టి స్థితి యందున్నప్పుడు అతనికొక పశోధన వచ్చెను. అది దేవునియొద్ద నుండియే వచ్చెను. “దేవుడు అబ్రాహామును శోధించెను” అని వ్రాయబడియున్నది (ఆది. 22:1) “శోధన” యనుమాటకు చెడ్డ అర్థము గలదు. కీడుచేయుటకైన ప్రేరణను శోధన యందుము. కాని అబ్రాహాముకు వచ్చిన శోధన యట్టిదికాదు. ఏలాగనగా –
దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు..... - యాకోబు 1:18
కాని అబ్రాహాముకు వచ్చిన శోధన యొక “పరీక్ష”, లేక “పరిశోధన” యని చెప్పవచ్చును. ఒకనాడు దేవుడు –
అబ్రాహామా, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని నేను నీతో చెప్పబోవు పర్వత ములలో నొకదాని మీద దహనబలిగా అతని నర్పింపు" నుని చెప్పెను - ఆది. 22:2
ఇది పిడుగువంటి యాజ్ఞ ; ఇవి హృదయమును బ్రద్దలుచేయు మాటలు. ఇవి సత్యములై యుండునా? ఇది స్వప్నము కాదు; దర్శనమును కాదు. అబ్రాహాము వినిన మాటలు తన జాగ్రతావస్థలో వినెను. అతడు దేవుని సర్వము నెరుగును. ఎన్నో మారులు అతడు దేవునితో సంభాషించియుండెను. ఆ స్వరమును ఏదయ్యమును ప్రతికల్పన (imitate) చేయలేదు. ఒకవేళ దయ్యమే అబ్రాహామును మోసగించుటకు దేవుని స్వరము ననుకరించిన యెడల దేవుడు వెంటనే ఆ సంగతి అతనికి తెలియజేసియుండును. కాని యది కేవలము దైవస్వరమేయని అబ్రాహము నిశ్చయముగా నమ్మెను. అబ్రాహాము ఎరిగిన దేవుని నైజమునకు ఇది కేవలము విరుద్ధమైనది కానీ దేవునికి ఈ పరిక్ష ప్రీతికరమైనది.
ఇక ఇస్సాక, అబ్రాహాము శారాలకు స్త్రీయపుత్రుడు; వారి నవ్వు, మూట; వారు 80 సంవత్సరములకు పైగా వేచియుండగా లభించిన వాగ్దాన పుత్రుడు; వారి వృద్ధాప్యాంతరిక్షమును వెలిగించిన జ్యోతి. ఇతడు సుగుణాల రాశి; సాత్వికుడు; వినయవిధేయుడు; శాంతమూర్తి. ఆతడు తన తల్లిదండ్రుల యాజ్ఞ నెన్నడును జవదాటి యెరుగడు. ఇట్టి కుమరుని చేతులార చంపుటెట్లు? “ఇస్సాకు వలన అయినదియే నీసంతాన మనబడును” (ఆది. 21 : 12). “నీవు ఆకాశమువై పు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీచేతనైతే లెక్కించుమని చెప్పి-నీసంతానము ఆలాగవును” అని దేవుడు అబ్రాహాముతో నొకప్పుడనెను (ఆది. 15 : 5). ఈ రోజున అబ్రాహాము ఇస్సాకును దహనబలిగ నర్పించిన యెడల ఈ వాగ్దానము లేమగును? ఆ సమయములో అబ్రాహాము హృదయములో చొరబడిన తలంపులు, రేగిన పోరాటము, దైవవాక్యములో వివరింపబడి యుండలేదు. ఇది దేవుడు, అబ్రాహాముల మధ్య నుండిన యొక మహామర్మము. కాని యాదైవాజ్ఞను అబ్రాహాము తన కుమరుని యెడల తనకున్న ప్రేమయొక్క పరీక్షగను, దేవునియెడల తనకున్న విశ్వాస విధేయతల యొక్క సవాలుగను గ్రహించెను.
అబ్రాహాము దేవునియొక వింతయాజ్ఞ నొక వింత రీతిని ప్రతిఘటించెను. అతడు సొదొమ కొరకు వాదించినట్లు తన కుమారుని కొరకు దేవునితో వాదించలేదు, యాచింపలేదు. దేవుడు తనతో ఇదివరకు చేసిన వాగ్దానములను గురించి యాక్షేపింపనులేదు. కాని, మారుమాటాడక ఆ యాజ్ఞ నతడు శిరసా వహించెను. ఆదికాండము 22 : 2, 3 వచనములలో దేవుడిచ్చిన ఆజ్ఞయు వెంటనే అబ్రాహామా యాజ్ఞను ప్రతిఘటించిన విధమును మనకు కన్పించును. ఎట్లనగా, “తెల్లవారి నప్పుడు అబ్రాహాము లేచి, తన గాడిదకు గంతకట్టి, తన పనివారిలో నిద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని లేచి దేవుడు తనతో చెప్పినచోటికి వెళ్ళెను” అని వ్రాయబడి యున్నది. అబ్రాహము దేవుని యాజ్ఞను నెరవేర్చుటలో కాలయావన చేయలేదు. చేసినయెడల అతని ధైర్యము సడలియుండును. అతడు తనభార్య శారాతో సంప్రదించి యుండలేదు. అట్లు చేసినయెడల అతని తీర్మానము నీరసిల్లి యుండెడిది. కాని దేవుడు చెప్పినదానిని సంకోచింపక, సాకులేమియు చెప్పక, వెంటనే చేసెను. అబ్రాహాము విధేయత, సగము విధేయతకాదు; అయిష్టముతోను, విసుగుదలతోను కూడినది కాదు. అది వెంటనే హృదయ పూర్వకముగ లోబడునట్టి విధేయత. దేవుని యెడల మన విధేయత ఎట్లున్నది ?

అబ్రాహాము మరునాడే తెల్లవారగానే ఇద్దరు సేవకులను, ఒక గార్దభమును, కుమారుని, తీసికొని బయలుదేరెను. సమిధలను మోయుటకు గాడిదను ఉపయోగించెను. వారందరు కాలినడకను మూడుదినములు ప్రయాణము చేసిరి. వారిద్దరు స్వారి చేయుటకు రెండు గుఱ్ఱములను గాని, కంచర గాడిదను గాని అబ్రాహాము తీసికొనిపోగలడు. కాని అతడట్లు చేయలేదు. దేవుని యాజ్ఞను నెరవేర్చుట కతడు కాలినడకను మూడుదినములు ప్రయాణము చేసెను. అబ్రాహాము జీవిత మంతయు నొక యాత్రయని యిదివరకు చూచితిమి. ఇది యతని చివరి ప్రయాణములలో నొకటి. మూడుదినములైన తరువాత దూరమున దేవుడు చెప్పిన మొరియా కొండ కనబడెను. అంత నొకచోట సేవకులను, గార్దభమును విడిచి, కట్టెలను కుమారుని శిరమున నుంచి, నిప్పుల కమండలమును తాను చేతబట్టి ఇద్దరును నడచిపోయిరి. అబ్రాహాము సుకుమారుడు కాడు. తన కుమారుని కూడ సుకుమారునిగ వెంచలేదు. కట్టెలను సేవకులచే మోయించలేదు. మార్గమున ఇస్సాకు –
నాతండ్రీ, నిప్పును; కట్టెలును, ఉన్నవిగాని దహనబలికి గొర్రెపిల్ల ఏది ?" అని అడిగి నప్పుడు అబ్రాహాము యొక్క ప్రేవు లెట్లు తరువుకొని పోయియుండెనో తండ్రులైన వారే గ్రహింప గలరు. పొర్లివచ్చు దుఃఖము నావుకొని, “నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనును" అని చెప్పెను. - ఆది. 22: 14
“యెహోవా ఈరే” అనుమాట యూదులలోను, క్రైస్తవులలోను ఒక పరిశుద్ధ మాటగా పరిణమించెను. మన కష్టములలోను, యిబ్బందులలోను, అవసరములలోను “యెహోవా ఈరే” అని చెప్పగలమా ? అబ్రాహాము చెప్పిన యీ మాటలను దేవుడు సత్యములుగ నిరూపించెను. చివరకు దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనెను.
తండ్రి కుమారులిద్దరును మొరియాకొండ నెక్కిరి: అచ్చట అబ్రాహా మొక బలిపీఠమును కట్టి తన కుమారుడైన ఇస్సాకును ఆ బలిపీఠమెక్కి దానిపై పరుండమని ఆదేశించెను. అప్పటికి ఇస్సాకునకు 25 సంవత్సరముల ప్రాయము. నిండు యౌవనములో నుండెను. తండ్రియాజ్ఞ యతనిని యాశ్చర్యచకితుని చేసినను మారుమాటాడక బలిపీఠ మెక్కెను. తండ్రిని తన చేతులను కాళ్లను బంధింప నిచ్చెను. ఆహా ! ఏమి విధేయత అబ్రాహాము దేవునియెడల చూపిన విధేయతనే ఇస్సాకు కూడ తన తండ్రి యెడల చూపుచున్నాడు. అప్పుడు ఇస్సాకు తన తండ్రి చెప్పిన గొర్రెపిల్ల తానేయని గ్రహించెను. “దేవుడు చూచుకొనిన గొర్రెపిల్ల” తానేయని గ్రహించినప్పుడతడు తృప్తి పొందెను. తన జీవితము ధన్యమైనదిగా నెంచెను. ఇట్లు ఇస్సాకు మరణము మట్టుకు తండ్రికి విధేయుడై యుండెను.
"వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువాని యెదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు" - యెషయా 58 : 7
అని మన ప్రభువునుగూర్చి చెప్పబడిన మాటలు ఇస్సాకు నందును సత్యములాయెను.
“లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల” యని చెప్పబడిన యేసుకు ఇస్సాకు ముంగుర్తుగా నుండెను (యోహాను 1:29), మరియు అబ్రాహాము తండ్రియైన దేవునికిని, ఇస్సాకు కుమారుడైన క్రీస్తుకును, మొరీయా కొండ కల్వరికిని, బలిపీఠము సిలువకును ముంగుర్తులుగ నుండెను.
అప్పుడు అబ్రాహాము తనకుమారుని వధించుటకు తనచెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవాధూత పరలోకమునుండి — అబ్రాహామా...ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము... నీకు ఒక్కడైయున్న నీకుమారుని నా కియ్య వెనుకతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నది అనెను - ఆది. 22: 10-12
అబ్రాహాము దేవునికి భయపడువాడని దేవుడెరిగెను (ఆది. 18:19). మానవ వ్యక్తిత్వము గ్రహించుటకు దేవునికే పరిశోధనయు అవసరములేదు. ఆయన మానవుని ఆంతర్యము నెరిగినవాడు (కీర్తన 139:2-4). అట్లయిన ఈ పరిశోధన యెందులకు ? అది మన కొరకు అనగా, అబ్రాహాము తరువాత వచ్చు విశ్వాస సమూహ మంతటి కొరకునై యున్నది. అబ్రాహాములో గుప్తమైయున్న అమూల్య విశ్వాసము మానవ దృష్టికి బహిర్గతము చేయబడవలయును. మన మేలు కోరి దేవుడిట్లు చేసెను. ఈ కార్యము చేయుటలో దేవుడు అబ్రాహామును ఘనపరచెను. దేవునిని ఘనపరుచువారిని దేవుడు ఘనపరుచును. “నా వస్త్రములు ముట్టినదెవరు?” అని క్రీస్తు అక్కడున్న జననమూహములకు బహిర్గతము చేయుటకై యుండెను (మార్కు. 5: 80–84). క్రీస్తు సమాధి మీది బండను దూత తొలగించుట క్రీస్తుకొరకు కాదుగాని శిష్యుల విశ్వాసమును స్థిరపరచుటకై యుండెను.
అబ్రాహాము తనకు యేకపుత్రుని దహనబలిగ నర్పింప సమకట్టుటలో చూపిన ధైర్యసాహసముల మూలరహస్యమును ఆ కార్యము జరిగిన దాదాపు 2000 సంవత్సరములకు తరువాత పరిశుద్దాత్ముడు దేవుడు హెబ్రీయులకు వ్రాయబడిన ఉత్తరములో విషదవరచెను –
“అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా నర్పించెను... (అతడు) మృతులను సహితము లేవుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపకముగా అతని మృతులలోనుండి మరల పొందెను" - హెబ్రీ 11: 17, 19
అబ్రాహాము దేవుని వాగ్దానములు నిరర్థకములు కానేరవని సంపూర్ణముగ నమ్మెను. తాను తన కుమారునర్పించినను, దేవుడు తన వాగ్దానమును నెరవేర్చు కొనుటకు ఇస్సాకును మృతులలోనుండి సహా లేపునని దృఢముగ నమ్మెను. ఇందు అబ్రాహాముయొక్క విశ్వాసప్రమాణము బైలుపడుచున్నది. వాస్తవముగ నబ్రాహాము ఇస్సాకు నర్పింపలేదు. కాని పై వాక్యములలో అతనిని అబ్రాహాము అర్పించినట్లుగానే చెప్పబడియున్నది. దేవుని దృష్టిలో ఉద్దేశమే ప్రధానమని యిచ్చట కన్పించును. (ఆది 22: 27, 29)
మొరియా అనుభవమందు అబ్రాహాము తన త్యాగబుద్ధిని చూపుటలో అత్యున్నత స్థాయి కొనెను. అట్టి త్యాగము సిలువలో తప్ప బైబిలులో మరెక్కడను కన్పించదు. అయినను అబ్రాహాము నరుడే. కావున అసంపూర్ణుడు. ఏ నరుడును పరిపూర్ణుడు కాడు. “ఏలియా మనవంటి స్వభావముగల మనుష్యుడే” అని వ్రాయబడిన మాటలు అబ్రాహామును గూర్చియు చెప్పవచ్చును (యాకోబు 5:17). బైబిలు పరిశుద్ధ గ్రంధము. అది సత్యమే పలుకును. అందులో పక్షపాతములేదు. నరుల మంచిచెడ్డలందు నమ్మకమైన రీతిని లిఖింపబడెను. నోవహు, లోతు, ఇస్సాకు, యాకోబు, దావీదుల పాపములను ఈ గ్రంధము తేటగా పొందుపరచెను. అబ్రాహాముయొక్క విశ్వాన వృత్తాంతము మన హెచ్చరిక కొరకెట్లు రచింపబడెనో… అట్లే యతని పాపములును మన జాగ్రత్త కొరకు లిఖింపబడెను. కాని ఈ కథ కొంత రసహీనమైనను (anti-climax) అబ్రాహాము యొక్క బలహీనతను గూర్చి కొంచెము ఆలోచితము. తప్పిపోయిన కుమారుని కథలో పెద్దన్న భాగము రసహీన భాగమే, అయినను ప్రభువు దానిని అసలు కథకు అదనముగ చేర్చెను (లూకా. 15 : 25-32). అందళి మొదటి భాగము మన హెచ్చరిక కొరకును, రెండవ భాగము మన జాగ్రత్త కొరకును పదిల పరచబడెను.
ఆబ్రాహాము యొక్క అవిశ్వాసము
అబ్రాహాము జీవితములో పాపములు మూడు సందర్భములలో తలయెత్తెను. అవేవన :
1. ఫరోయెదుట అబ్రాహామాడిన అబద్ధము:
కనానులో కరవు సంభవించెను. కావున అబ్రాహాము తన పరివారమంతటిలో ఐగుప్తుకు వలసపోయెను. వాగ్దాన దేశములో కరవును, అన్యదేశములో సమృద్ధియు నుండుట మనకు విపరీతముగ కాన్పించినను, అది లోక రీతియని యెరుగవలయును. భక్తుడైన లాజరు కురుపుచే బాధపడుచు దరిద్రతననుభవించుచుండగ, ప్రక్కనే ధనికుడు ఆరోగ్యైశ్వర్య భాగ్యములను అనుభవించుచుండలేదా? ఇది లోకము యొక్క పరిపాటి. అబ్రాహాము ఐగుప్తీయులు దైవభయము లేనివారని తలచి తన భార్య శారా సౌందర్యవతి యగుటచే ఆమె నిమిత్తము ఆ దేశపు రాజైన ఫరో తన్ను చంపునేమో అని భయపడి శారా తన చెల్లెలని అబద్ధమాడెను. శారా చేతకూడ అబద్ధమాడించెను. ఇది యొక హైన్యపాపము. అబ్రాహామంతటివాడు తన ప్రాణ రక్షణార్ధము తన భార్యమానమును అమ్మి వేయ జూచుట సిగ్గుకరమైన పిఱికితనము. కాని దీని మూలము అవిశ్వాసము. ఇది కనానులోనే ప్రారంభమాయెను. వాగ్దత్త భూమిలో కరువు కాలమున కూడ దేవుడు తన్ను పోషింప సమర్ధుడని అబ్రాహాము నమ్మలేక పోయెను. అవిశ్వాసులైన కనానీయులచ్చటనేయుండ, విశ్వాను లకు తండ్రియైన అబ్రాహాము ఐగుప్తుకు పారిపోయెను. అబ్రాహాము ఐగుప్తుకు పోవుట దేవుని చిత్తము కాదు. ఇప్పుడు తన ప్రాణ రక్షణకొరకు అబద్ధమాడుచున్నాడు. దేవుడు ఫరో చేతినుండి తన ప్రాణమును కాపాడగలడనియు నమ్మలేక పోయెను. కాని దేవుడతని కరుణించెను. ఆయనే ఫరోకు సత్యమును బైలువరచి, శారాయొక్క మానమును కాపాడెను. అన్యుడైన ఫరోచేత అబ్రాహామును గద్దింపజేసెను. ఫరో, శారాను తనయింట చేర్చుకొనిన తరువాత
“అతడు ఆమెనుబట్టి అబ్రాహాముకు మేలుచేసెను. అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదెలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదెలు, ఒంటెలు యిచ్చెను" - ఆది. 12:16
ఇదియొక నీచమైన బహుమానము. యుద్ధఫలితముగ వచ్చిన న్యాయమైన యీవిని రాజివ్వబోగా దానిని నిరాకరించిన అబ్రాహాము ఈనాడు తన భార్య కొరకీయబడిన కూలిని అంగీకరించెను. ఒక పాపమనేక పాపములకు దారితీయును. ఈ విషయములో అబ్రాహాము మనకు జాగ్రత్త సూచనగా నున్నాడు.
"తాను నిలుచుచున్నానని తలంచు కొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను" అని దైవవాక్యము హెచ్చరించుచున్నది - 1 కొరింది. 10:12
2. అబ్రాహాము హాగరును వరిణయయమాడుట:
ఇదియు ఒక అవిశ్వాస కార్యమే. అబ్రాహాము దేవుని వాగ్దానము నెరవేర్చుకొరకు ఓపికతో కనిపెట్టలేక పోయెను. ఇందు అబ్రాహాము శారాలు తమ స్వచిత్తమును దైవచిత్తమునకు అడ్డుపెట్టిరి. హాగరు ఫరో రాజు దానము చేసిన “పనికత్తెల”లో ఒకతెయైయుండవచ్చును. రూపసి అగుటచే శారా ఆమెను తన స్వంత దాసిగ తనచెంతనుంచుకొనెను. ఆమె ఇప్పుడు తన భర్తకు భార్యగ అయ్యెను. ఇందుకు శారా హవ్వవలెనే అబ్రాహామును శోధనలోనికి నడిపించెను. ఈ వివాహము శారాకు దుఃఖమును కలుగచేసెను. దీని ఫలితము – ఇశ్మాయేలు. ఇతడు దేవుని సంకల్పములో లేనివాడు. అతడు అబ్రాహాము శారాల స్వచిత్తమునుబట్టి వారి అవిశ్వాస ఫలితముగ వచ్చెను.
"అతడు అడవిగాడిదెవంటి మనుష్యుడు. అతనిచెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగ నుండును” అని చెప్పబడినవాడు - ఆది. 16 : 12
తుదకు అబ్రాహాము, హాగరును ఇష్మాయేలును తన యింటనుండి వెడల గొట్టవలసి వచ్చెను. ఇది ఆబ్రాహాముకు దుఃఖము కలుగజేసెను (ఆది. 21 : 11). అయినను అట్లుచేయక తప్పినదికాదు. ఇది జరిగినప్పుడు ఇష్మాయేలుకు 18 లేక 20 సంవత్సరముల వయస్సు యుండును. అతడు తన తండ్రియొక్క అన్యాయమును క్రౌర్యమును గ్రహించి తన హృదయమును ద్వేషముతోను, పగతోను నింపుకొనెను. ఐగుప్తీయురాలైన హాగరు తన పుత్రుని ఒక ఐగుప్తీయురాలిని తెచ్చి వివాహము చేసెను. అందువలన ఇష్మాయేలు అబ్రాహాముకు కడు దూరస్థుడై పోయెను. హెబ్రీయుడుగా నుండవలసిన ఇష్మాయేలు ఐగుప్తీయుడై పోయెను. అతడు అబ్రాహాము దేవుడైన యెహోవాకు కూడ దూరమై పోయెను. అబ్రాహామునుబట్టి దేవుడు ఇష్మాయేలును దీవించినను, అతని సంతానమునకు అబ్రాహాము సంతతికిని బద్ధవైరము ఏర్పడెను. ఏశావు, ఇష్మాయేలు కుమార్తెను వివాహమాడెను. అతని సంతానమైన ఏదోమీయులు కూడ ఇశ్రాయేలీయులకు విరోధులైరి. యోసేపు అన్నలు అతనిని ఇష్మాయేలీయుల కమ్మిరి. వారొక ఐగుప్తీయున కమ్మిరి. ఇప్పుడు ఐగుప్తు రాజ్యము ఇశ్రాయేలు రాజ్యమునకు పరమ శత్రువు; దానిని సర్వనాశనము చేయుటకు కంకణము కట్టుకొనినది. ఐక్య అరబ్బీ రాష్ట్రమను నొక దానిని లేవదీసి దానితో ఇశ్రాయేలు రాజ్యము చుట్టును ముట్టడి వేయుచున్నది. పాపము యొక్క చేతులెంత పొడవో చూచితివా ? నీ విప్పుడు చేయుచున్న పాపఫలిత మెంతదూరము పోవునో నీకు తెలియునా?
3. గెరారురాజు యెదుట అబ్రాహా మాడిన అబద్ధము
కనానులో మరియొకసారి కరుపు రాగా అబ్రాహాము గెరారు దేశమునకు వలసపోయెను. అచ్చట కూడ ఐగుప్తులో వలెనే తన భార్యయైన శారా తన చెల్లెలని అబద్ధమాడెను. చేసిన పావమునే మరల చేయుట ఘోరము. అబ్రాహాము అట్లుచేసెను. అబీమెలెకు శారా నిమిత్తమిచ్చిన బహుమానము నంగీకరించెను. దీని ఫలితముగా ప్రియమైన తన కుమారుడైన ఇస్సాకు కూడ అట్లే చేసెను. మన పాపములు మన బిడ్డలలో కనుపించును. దావీదు యొక్క పాపములు అతని కుమారులైన అమ్నోను, అబ్షాలోములలో అంతకంటే భయంకర రూపమున ప్రత్యక్షమాయెను. ఇది పాపము యొక్క భయంకర స్వభావము. కావున మన బిడ్డల నిమిత్తమైనను మనము పాపమునకు దూరముగ నుండవలయును.

అబ్రాహాము యొక్క వ్యక్తిత్వము
ఇంతవరకు చదువుచు వచ్చిన అబ్రాహాము చరిత్రనుబట్టి మనము అతని శీలమును గ్రహించగలము. అయినను ముగింపులో మరియొకసారి దానిని సింహావలోకనము గావించుట మంచిదని తలంచెదను. అనేక క్రైస్తవ సద్గుణములలోను, సత్కార్యములలోను అబ్రాహాము మనకు ఆదర్శ ప్రాయుడుగ నున్నాడు. అబ్రాహాములో కొన్నిటిని జ్ఞాపకము చేసికొందము:
1. విశ్వాసము: ఇది అబ్రాహాముయొక్క ప్రధాన లక్షణము. దేవుని మాట చొప్పున తన జనులను, దేశమును, మతమును విడిచి ఊరు నుండి హారానుకును, హారాను నుండి కనానుకు చేసిన దీర్ఘ సాహస ప్రయాణమందును, వృద్ధాప్యములో కుమారుని సమర్పించామని దేవుడు చెప్పిన మాటను అక్షరాల నమ్ముటయందును, తన యేకప్రియపుత్రుని దహనబలిగ అర్పింప సమ కట్టుటయందును, ఇది వ్యక్తమాయెను.
2. విధేయత: విధేయతలేని విశ్వాసము సారహీనము. సంపూర్ణ విధేయత ద్వారా అతనిలోని విశ్వాసము కార్యరూపమును దాల్చెను.
3. వినయము : ఇదియొక చక్కని క్రైస్తవ లక్షణము. దీని సంపూర్ణ రూపము క్రీస్తునందు కనబడును (ఫిలి. 2: 5-11). కాని క్రీస్తుకు ముందు అబ్రాహామునందు కనబడెను. శారా మృతి బొందగా ఆమెను పాతిపెట్టుటకు ఒక స్మశాన భూమిని కొను సందర్భమున హేతు కుమారులతో సంప్రదించునప్పుడు అబ్రాహాము వారియెదుట. రెండుమారులు సాగిల పడినట్లు వ్రాయబడెను- (ఆది. 23 : 7, 12). హేతు కుమారులు అబ్రాహాముతో “నీవు మామధ్య మహారాజువలె నున్నావు” అని చెప్పుచున్నను మహారాజైన అబ్రాహాము వారికి సాష్టాంగ నమస్కారము చేసెను. తనచర్య యంతటిలో అబ్రాహాము చూపిన వినయ మర్యాదలను ఆదికాండము 28 వ అధ్యాయమందు మనము తేటగ చూడగలము, అల్పులలో వినయ గుణము నీచముగ నెంచబడును. కాని గొప్పవారిలో దానికి వన్నె వచ్చును; అది వారికి వన్నెనిచ్చును. అబ్రాహాము తన వినయ, మర్యాదలతో తన్ను తానలంకరించుకొనెను.
4. ఔదార్యము: లోతును శ్రేష్ఠభాగము నేర్పర్చు కొననిచ్చి తాను నిస్సారమైన రాతి ప్రదేశమును తీసికొనుటలో అబ్రహాము గుణము వ్యక్తమగుచున్నది.
5. ధైర్యసాహసములు: కొద్ది పరివారముతో నలుగురు రాజులను ఓడించి లోతును విడిపించెను.
6. దైవభక్తి: అబ్రాహాము వెళ్ళిన చోటనెల్ల నొక బలిపీఠమును కట్టి దేవునిని ఆరాధించెను. షాలేము రాజుకు దశమాంశమిచ్చెను. దశమాంశమును గూర్చిన యాజ్ఞ పుట్టక మునుపే అబ్రాహాము దానిని ప్రారంభించెను. దీని అంతరార్ధము హెబ్రీ. 7 వ అధ్యాయములో వివరించబడినది.
7. ప్రార్ధన, విజ్ఞావనాపరుడు: అబ్రా హాము ఇష్మాయేలు కొరకు చేసిన ప్రార్ధనను, అబీమెలెకుకొరకు చేసిన ప్రార్థనను దేవుడంగీకరించెను. (ఆది. 17:20; 20:7, 17). అతడు సొదొమ కొరకు చేసిన విజ్ఞాపన ఎన్నతగినది.
8. న్యాయము: హేతు కుమారులు స్మశాన భూమిని ఊరకనే ఇచ్చెదమని బ్రతిమాలుచుండినను అబ్రాహాము ఒప్పక బలవంతముగ దానికి సరియైన వెలనిచ్చి వారియొద్ద కొనెను.
9. ఆతిధ్యము: ఆతిధ్యముచేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిధ్యము చేసిరి”. అని హెబ్రీగ్రంధకర్త అబ్రాహామునుద్దేశించి వ్రాసెను (హెబ్రీ. 18:2; ఆది. 18:3)
10. సమాధాన ప్రియుడు: “మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు” అని చెప్పుటలో అతని స్వభావము బయలుపడుచున్నది. సమాధానము కొరకు అబ్రాహాము ఎంతత్యాగమైనను చేయ సంసిద్ధుడై యుండెను. (ఆది. 18:8)
అబ్రాహాము వ్యక్తిత్వములో ఇంక అనేక సద్గుణములు గలవు. వానినన్నిటి నిచ్చట వివరించుటకు వీలులేదు. ఆదికాండములో అతని చరిత్రను తెలువు 16 అధ్యాయములను జాగ్రత్తగ చదివి ధ్యానించినచో బోధపడును. ప్రస్తుతమున భారత క్రైస్తవ సంఘమునకు అబ్రాహాములెందరో కావలయును. దేవుడు తన యధిక కృపచేత తన కుమారుడైన క్రీస్తునందు పరిశుద్ధాత్మద్వారా మన సంఘములలో ననేక అబ్రాహాములను లేపును గాక! ఆమెన్.
Thanks for sharing your thoughts. I really appreciate your efforts and I will be waiting for your further
post thanks once again.