భయంకరమైన తుఫానులో ప్రశాంతత (మార్కు 4:35 – 41) – Edward Williams

గమనిక: ఈ వర్తమానం Edward Williams Kuntam గారు ప్రసంగించినది. ఈ వర్తమానం Telugu Bible Analysis  స్వంత మాటలలో వ్రాసిన అసలు భాగం, ఈ క్రింది YouTube వీడియోలో చెప్పిన వర్తమానం నుండి వ్రాసినది – Link.

—————————————————————————————————–

మానవ జీవితం ఒక మహా సముద్రం లాంటిది. కొన్నిసార్లు అది ప్రశాంతంగా, అలల తాకిడి లేని నిశ్చలమైన నీటిలా కనిపిస్తుంది. ఆ సమయంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా, సాఫీగా సాగిపోతుంది. కానీ, మరికొన్ని సార్లు ఊహించని విధంగా ఆకాశం మేఘావృతమై, భయంకరమైన గాలులు వీచి, సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. అలలు ఎగసిపడి పడవను/నావను ముంచేయడానికి ప్రయత్నిస్తాయి. సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే మనం మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎదుర్కొంటూ ఉంటాం. ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, కుటుంబ కలహాలు, ఆత్మీయ పోరాటాలు అనే తుఫానులు మనల్ని చుట్టుముట్టినప్పుడు, మన జీవన నావ మునిగిపోతుందేమోనన్న భయం మనల్ని ఆవహిస్తుంది.

పరిశుద్ధ గ్రంథంలోని మార్కు సువార్త 4:35 – 41 వచనాల వరకు ఉన్న యేసు ప్రభు మరియు శిషుల సంఘటన చూద్దాం!, కేవలం ఒక చరిత్ర కాదు; అది ప్రతి విశ్వాసి జీవితంలో జరిగే ఒక వాస్తవిక అనుభవం. ఆనాడు గలిలయ సముద్రంలో శిష్యులు ఎదుర్కొన్న ఆ భయంకరమైన తుఫాను, ఈనాడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన లోతైన ఆత్మీయ పాఠాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

విధేయతలో విపత్తులు: ఆయన మాటకు లోబడినప్పుడే తుఫాను వచ్చింది

చాలామంది విశ్వాసుల్లో ఒక అపోహ ఉంది. “నేను దేవుని మాటకు లోబడితే, నేను ప్రార్థన చేసుకుంటే, నేను భక్తిగా ఉంటే నా జీవితంలోకి ఏ కష్టాలు రావు” అని అనుకుంటారు. కానీ ఈ వాక్యభాగం ఆ అపోహను పటాపంచలు చేస్తుంది. ఆ రోజు సాయంత్రం యేసు ప్రభువు తన శిష్యులతో, “మనము అద్దరికి వెళ్ళుదము రండి” అని చెప్పారు. శిష్యులు తమ సొంత పనుల మీద, సొంత వ్యాపారాల కోసం సముద్రం మీదకు వెళ్లలేదు. వారు కేవలం యేసు మాటకు లోబడి, ఆయన ఆజ్ఞను శిరసావహించి పడవ ఎక్కినారు. అయినప్పటికీ ఏం జరిగింది? “గొప్ప తుఫాను రేగెను” అని వాక్యం సెలవిస్తోంది. 

మనం గమనించవలసిన మొదటి సత్యం ఇదే: దేవుని చిత్తంలో ఉన్నంత మాత్రాన కష్టాలు రాకుండా పోవు. యేసు ప్రభువు ఆ పడవలో ఉన్నప్పటికీ, వారు ఆయన మాటకు లోబడి ప్రయాణం చేస్తున్నప్పటికీ, తుఫాను వారిని వదిలిపెట్టలేదు. కాబట్టి, ఈరోజు నీ జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చిందంటే, నువ్వు ఏదో పాపం చేశావనో, లేక దేవుడు నిన్ను వదిలేసాడనో అర్థం కాదు. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చే మార్గంలోనే అతిపెద్ద అడ్డంకులు ఎదురవుతాయి. అద్దరికి చేరాలన్నది దేవుని సంకల్పం అయితే, మధ్యలో వచ్చే తుఫానులు ఆ సంకల్పాన్ని పరీక్షించే సాధనాలు మాత్రమే.

మరిన్ని PDF ల కొరకు: www.telugubibleanalysis.in ను చూడండి.

మానవ ప్రయత్నాల వైఫల్యం: శిష్యుల అనుభవం పనికిరాని వేళ

ఆ పడవలో ఉన్నది ఎవరు? పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ వంటి వారు. వీరు సామాన్య ప్రజలు కాదు; వీరు గలిలయ సముద్రంలో పుట్టి పెరిగిన జాలరులు (Fishermen). సముద్రం యొక్క ప్రతి కదలిక వారికి తెలుసు. బైబిల్ వ్వారిని జాలరులు అని పరిచయం చేస్తుంది. ఎప్పుడు గాలి ఎటు వీస్తుందో, ఎప్పుడు తుఫాను వస్తుందో అంచనా వేయగల దిట్టలు/అనుభవం కలవారు. అలాంటి అనుభవజ్ఞులే ఆ రోజు భయపడ్డారు అంటే, ఆ తుఫాను ఎంత భయంకరమైనదో మనం అర్థం చేసుకోవచ్చు.

అలలు పడవ మీద కొడుతున్నాయి, నీళ్లు పడవలోకి వచ్చేస్తున్నాయి, పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. వారి అనుభవం, వారి నైపుణ్యం, వారి బలము – ఏదీ ఆ రోజు పని చేయలేదు. మన జీవితంలో కూడా అంతే. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మన చదువు, మన డబ్బు, మన పలుకుబడి, మనకున్న డాక్టర్లు, మనకున్న తెలివితేటలు – ఇవేవీ మనల్ని కాపాడలేవు. దేవుడు కొన్నిసార్లు మనల్ని “నా వల్ల ఏమీ కాదు ప్రభువా” అనే నిస్సహాయ స్థితికి  తీసుకువెళతాడు. అప్పుడే మనం మన సామర్థ్యం మీద కాకుండా, దేవుని శక్తి మీద ఆధారపడటం నేర్చుకుంటాం. శిష్యులు తమ ప్రయత్నాలన్నీ చేసి విఫలమైనప్పుడే, ఆఖరి ప్రయత్నంగా యేసు వైపు తిరిగారు.

నిద్రిస్తున్న రక్షకుడు: అది నిర్లక్ష్యమా? లేక నిశ్చింతయా?

తుఫాను అంత బీభత్సం చేస్తావుంటే… యేసు ప్రభువు ఏం చేస్తున్నారు? ఆయన పడవ అమరమున (వెనుక భాగమున) తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. ఇది చాలా ఆశ్చర్యకరమైన దృశ్యం/విషయము. బయట చావు కేకలు, గాలి హోరు, అలల శబ్దం… కానీ లోపల యేసు ప్రభ్వూ గాఢనిద్రలో ఉన్నారు. ఇక్కడ మనం యేసు ప్రభువు యొక్క రెండు స్వభావాలను (Dual Nature) చూడగలం.

haggai book telugu commentary pdf
హగ్గయి గ్రంథము వివరణ మరియు చరిత్ర – Edward Williams kuntam

ఒకటి, ఆయన “సంపూర్ణ మానవుడు” (Fully Man). ఉదయమంతా ప్రజలకు బోధించి, రోగులను బాగుచేసి ఆయన శారీరకంగా అలసిపోయారు. అందుకే ఆయనకు నిద్ర అవసరమైంది. రెండవది, ఆయన “సంపూర్ణ దేవుడు” (Fully God). సృష్టికర్తకు సృష్టిని చూసి భయం ఎందుకు ఉంటుంది? ఆయనకు తెలుసు – ఆ పడవ మునిగిపోదని. ఎందుకంటే ఆయన వాగ్దానం “మనం అద్దరికి వెళ్దాం” అని, అంతేగానీ “మధ్యలో మునిగిపోదాం” అని కాదు. అనగా యేసు వారు ముందే ఆయన హామీని ఇచ్చాడు – వీరి విశ్వాసాన్ని పరీక్షించాడు.

కానీ శిష్యులకు ఆయన నిద్ర “నిర్లక్ష్యం”గా కనిపించింది. మనకు కూడా చాలాసార్లు అలాగే అనిపిస్తుంది. “దేవా, నేను ఇక్కడ చచ్చిపోతుంటే నువ్వు మౌనంగా ఉన్నావేంటి? నా ప్రార్థనలు నీకు వినిపించడం లేదా? నా కన్నీళ్లు నీకు కనిపించడం లేదా?” అని మనం ప్రశ్నిస్తాం. కానీ, దేవుని మౌనం ఆయన లేమిని సూచించదు (God’s silence is not God’s absence). ఆయన మౌనంగా ఉన్నాడంటే, ఆయన పరిస్థితిని తన నియంత్రణలో ఉంచుకున్నాడని అర్థం. ఆయన తుఫానులో కూడా నిద్రించగలడు అంటే, ఆ తుఫాను ఆయనకు లోబడి ఉందని అర్థం.

storm in calm - Jesus christ and desciples

భయం నుండి పుట్టిన ప్రార్థన: నిందతో కూడిన విజ్ఞాపన

శిష్యులు ఇక తట్టుకోలేక భయంతో యేసును లేపారు. వారు ఆయన్ను లేపిన విధానం గమనించండి. “బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింతలేదా?” అని అడిగారు. ఇది విశ్వాసంతో కూడిన మనవి/వినతి కాదు; ఇది నిందతో కూడిన ప్రశ్న. “నీకు మా గురించి పట్టదా?” అనే ఆక్రోశం అడిగిన ప్రశ్న.

కష్టాల్లో ఉన్నప్పుడు మన ప్రార్థనలు కూడా ఇలాగే ఉంటాయి. “ప్రభువా, నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు? పక్కవాళ్ళకు బాగానే ఉంది కదా, నాకే ఎందుకు ఈ కష్టం?” అని దేవుని ప్రేమను శంకిస్తాం/ ప్రశ్నిస్తాం. శిష్యులు యేసు శక్తిని తక్కువ అంచనా వేయలేదు, కానీ ఆయన “ప్రేమను” తక్కువ అంచనా వేశారు. ఆయనకు శక్తి ఉందని వారికి తెలుసు, కానీ ఆయన తమను కాపాడతాడా లేదా అనే సందేహం వారిలో ఉంది. భయం మనిషిని ఎంతగా దిగజారుస్తుందంటే, తనతో ఉన్నది సాక్షాత్తు దేవుడని మరిచిపోయేలా చేస్తుంది. వారు చూస్తున్నది అలలను, గాలులను మాత్రమే; ఆ అలలను సృష్టించిన వాడిని చూడలేకపోయారు.

యేసు అధికార స్వరము: ఊరకుండుము!

యేసు ప్రభువు లేచినాడు. ఆయన మొదట చేసింది ఏమిటి? శిష్యులతో కలిసి పడవలో ఉన్న నీళ్లను తోడలేదు. లేదా “ఎవరైనా కాపాడండి” అని అరవలేదు. ఆయన నేరుగా సమస్య మూలాన్ని (Root Cause) చూశారు. ఆయన గాలిని గద్దించి, సముద్రముతో – “నిశ్శబ్దమై ఊరకుండుము” (Peace, be still) అని ఆజ్ఞాపించారు.

వెంటనే గాలి అణిగిపోయెను, మిక్కిలి నిమ్మళమాయెను. గమనించండి, తుఫాను నెమ్మదిగా తగ్గలేదు. సాధారణంగా ప్రకృతిలో ఒక తుఫాను వచ్చాక, సముద్రం కుదుటపడటానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ, సృష్టికర్త స్వరం వినగానే సృష్టి తక్షణమే లోబడింది.మిక్కిలి నిమ్మళమాయెను.

ఇక్కడ మనకు ఒక గొప్ప పాఠం ఉంది: మన జీవితంలో తుఫానులు రేగినప్పుడు, మనం మనుషుల సహాయం కోసం పరుగెడతాం, లేదా మన సొంత ప్రయత్నాలతో ఆ నీళ్లను తోడేయాలని చూస్తాం. కానీ మనం చేయవలసింది ఒక్కటే – ‘యేసును నిద్రలేపడం’. అంటే, ప్రార్థన ద్వారా ఆయన శక్తిని ఆహ్వానించడం. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, సంవత్సరాల తరబడి వేధిస్తున్న సమస్యలు ఒక్క క్షణంలో సమసిపోతాయి. డాక్టర్లు చేతులెత్తేసినా, కోర్టు కేసులు పరిష్కారం కాకపోయినా, అప్పుల బాధలు ముంచేస్తున్నా – ఆయన “శాంతి” అని చెప్తే చాలు, అక్కడ సమాధానం కలుగుతుంది.

విశ్వాస పరీక్ష: అసలు సమస్య తుఫాను కాదు, భయమే

తుఫాను ఆగిపోయాక, యేసు శిష్యుల వైపు తిరిగి రెండు ప్రశ్నలు వేశారు:

  1. “మీరెందుకు భయపడుచున్నారు?”
  2. “మీరింకను నమ్మికలేక యున్నారా?”

యేసు దృష్టిలో అసలు సమస్య బయట ఉన్న తుఫాను కాదు, శిష్యుల లోపల ఉన్న “భయం“. బయట తుఫానును ఆపడం ఆయనకు ఒక నిమిషం పని. కానీ ఆయన వారి హృదయాల్లో ఉన్న అవిశ్వాసం అనే తుఫానును ఆపాలని కోరుకున్నారు.

యేసు వారిని ఎందుకు మందలించారు? ఎందుకంటే, ఆయన అంతకుముందే ఎన్నో అద్భుతాలు చేశారు. కుష్ఠురోగులను బాగుచేశారు, చనిపోయినవారిని లేపారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా, ఒక చిన్న తుఫాను రాగానే వారు “మేము నశించిపోతున్నాం” అనుకోవడం వారి అవిశ్వాసాన్ని సూచిస్తుంది. విశ్వాసం అంటే ఏమిటి? దేవుడు మన కళ్ళకు కనిపించే కార్యాలు చేస్తున్నప్పుడు నమ్మడం కాదు; అంతా వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు, పడవ మునిగిపోతున్నట్లు అనిపించినప్పుడు కూడా – “నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను దాటిస్తాడు” అని నమ్మడమే నిజమైన విశ్వాసం.

యోసేపు - joseph
యోసేపు జీవితం: Joseph Life and History – Edward Williams Kuntam Messages PDF

ముగింపు: ఈయన ఎవరో?

ఈ సంఘటన చివరలో శిష్యులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: “ఈయన ఎవరో? గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవే!”

తుఫానుకు ముందు వారికి యేసు ఒక బోధకుడిగా, ఒక అద్భుతాలు చేసే వ్యక్తిగా మాత్రమే తెలుసు. కానీ తుఫాను వచ్చిన తర్వాత, వారు ఆయనలో ఉన్న “దైవత్వాన్ని” చూశారు. ప్రకృతిని శాసించగలిగే దేవుడిగా ఆయనను గుర్తించారు.

దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే – తుఫానులకు ఒక ఉద్దేశ్యం ఉంది (Storms have a purpose). దేవుడు మన జీవితంలో కష్టాలను ఎందుకు అనుమతిస్తాడు? మనల్ని నాశనం చేయడానికి కాదు, తనను తాను మనకు సరికొత్తగా బయలుపరచుకోవడానికి. ఆ తుఫాను రాకపోతే, యేసు గాలిని సముద్రాన్ని శాసించగలడని శిష్యులకు తెలిసేది కాదు. అలాగే, నీ జీవితంలో వచ్చిన ఈ ఆర్థిక ఇబ్బంది, ఈ అనారోగ్యం, ఈ సమస్య – ఇవన్నీ దేవుని శక్తిని నీవు రుచి చూడడానికే వచ్చాయి.

ఈరోజు నీవు ఎలాంటి భయంకరమైన తుఫానులో ఉన్నావో గాని…. అలలు నీ మీదకు వస్తున్నాయా? పడవ మునిగిపోతోందా? భయపడకు. నీ పడవలో యేసు ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడని దిగులుపడకు. ఆయనకు అప్పగించు. ఆయన సరైన సమయంలో లేచి, నీ సమస్యను గద్దించి, నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని కలుగజేస్తాడు. తుఫాను నిన్ను ముంచేయదు, అది నిన్ను దేవుని వైపు నడిపించే ఒక సాధనం మాత్రమే.

ధైర్యం తెచ్చుకో! మనము అద్దరికి వెళ్ళుదము – ఇది ఆయన మాట. ఏ తుఫాను ఆ మాటను మార్చలేదు. ఆమెన్.

DOWNLOAD PDF

For content join: Whatsapp – Join & Telgram – Join  Youtube – Join

Leave a Comment